నిర్భయ దోషులకు ఇక రేపే ఉరి... అందరి పిటిషన్లను తిరస్కరించిన పటియాలా హౌస్ కోర్టు!

  • తమకింకా న్యాయపరమైన అవకాశాలున్నాయంటూ దోషుల పిటిషన్
  • దోషులకు రేపు ఉదయం ఉరి
  • కోర్టు వద్ద స్పృహతప్పి పడిపోయిన దోషి భార్య  
తమకింకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయంటూ నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు తిరస్కరించింది. ఉరితీత అమలు నిలిపివేయాలంటూ దోషులు పిటిషన్లు దాఖలు చేయగా, అన్నింటిని కొట్టివేస్తూ న్యాయస్థానం మరణశిక్ష అమలుకు మార్గం సుగమం చేసింది.

"న్యాయపరమైన అవకాశాలు ఇంకేమీ మిగల్లేదు. పవన్, అక్షయ్ మళ్లీ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను కూడా రాష్ట్రపతి తిరస్కరించారు" అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ న్యాయస్థానానికి తెలియజేశారు. నా స్నేహితుడితో 100 పిటిషన్లు వేయించగలను, అలాంటి పిటిషన్లను కూడా న్యాయపరమైన అవకాశాలుగా భావిస్తామంటే ఎలా? అంటూ ఇర్ఫాన్ అహ్మద్ కోర్టులో వాదనలు వినిపించారు.

కాగా, కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో నిర్భయ దోషి అక్షయ్ భార్య స్పృహతప్పి కిందపడిపోయింది. దాంతో అక్కడ కాసేపు కలకలం రేగింది. ఆమె కొన్నిరోజుల కిందటే తన భర్త నుంచి విడాకులు కోరుతూ డైవోర్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఢిల్లీ కోర్టు కూడా దోషుల పిటిషన్లను తిరస్కరించడంతో, ఇక రేపు వారి ఉరి ఖాయమేననిపిస్తోంది. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అక్షయ్ ఠాకూర్ (31), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), ముఖేశ్ సింగ్ (32)లకు మరణశిక్ష అమలు చేయనున్నారు.


More Telugu News