ఇష్టమొచ్చిన రెమెడీలు వద్దు.. నిపుణుల సలహా తీసుకోండి: 'కరోనా'పై మంత్రులకు మోదీ హెచ్చరిక

  • బీజేపీ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండటంతో స్పందన
  • ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు, సూచనలు పాటించాలని విజ్ఞప్తి
  • కరోనాపై మోదీ చాలా అలర్ట్ గా ఉన్నారన్న కేంద్ర మంత్రి
కరోనా వైరస్ నివారణకు ఆవు మూత్రం పనిచేస్తుంది, మరేదో పనిచేస్తోదంటూ బీజేపీ మంత్రులు, నేతలు మాట్లాడుతుండటంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు, చర్యలపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మోదీ స్పందించారు. అయితే ఈ విషయాలను నేరుగా ప్రస్తావించకుండానే మంత్రులు, బీజేపీ లీడర్లకు పలు హెచ్చరికలు జారీ చేశారు.

నిపుణులు చెప్పినట్టు చేయండి

కరోనా వైరస్ నివారణకు సంబంధించి ఇష్టమొచ్చిన రెమెడీలు పాటించడం, ప్రచారం చేయడం వద్దని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి గానీ, ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి గానీ వచ్చిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో మోదీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

మోదీ ఎంతో అలర్ట్ గా ఉన్నారన్న కేంద్రమంత్రి

కరోనా వైరస్ విషయంపై మోదీ ఎంతో అలర్ట్ గా ఉన్నారని కేంద్ర మంత్రి ఒకరు జాతీయ మీడియాతో చెప్పారు. ‘‘మోదీ మనందరికంటే మూడు అడుగులు ముందే ఉన్నారు. కరోనా వైరస్ విషయంపై రాత్రి, పగలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని విషయాల్లో కఠిన నిర్ణయాలకు కూడా వెనుకాడటం లేదు. ఆ నిర్ణయాలపై మా అభిప్రాయం మాత్రమే అడుగుతున్నారు..” అని వెల్లడించారు.


More Telugu News