ఏపీలో ఈనెల 31 నుంచి పదో తరగతి పరీక్షలు యథాతథం: మంత్రి ఆదిమూలపు సురేష్

  • విద్యార్థులకు అన్ని సౌకర్యాల కల్పన 
  • ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయి 
  • హాస్టళ్లు, కళాశాలలకు మాత్రమే సెలవు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు మూసివేత నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అయితే పదో తరగతి పరీక్షలు ఈనెల 31 నుంచి యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. 

అలాగే ఇంటర్ పరీక్షలు కూడా ఈనెల 23వ తేదీలోగా పూర్తికానున్నట్లు చెప్పారు. సెలవుల కారణంగా విద్యార్థులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య సౌకర్యం అందజేస్తున్నామన్నారు. సెలవుల విషయంలో ఈనెల 31వ తేదీ తర్వాత పరిస్థితిని మరోసారి సమీక్షించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.



More Telugu News