రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇదే పెద్ద సవాలు!: జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్

  • 170కి పైగా దేశాల్లో కరోనా మహమ్మారి
  • ప్రజలే నియంత్రణ పాటించాలని సూచన
  • పరిశుభ్రత ప్రధానం, కరచాలన వద్దన్న మెర్కెల్
ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాలకు పైగా కరోనా మహమ్మారి విస్తరించిన వేళ, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత కరోనా వైరస్ జర్మనీకి అతిపెద్ద సవాలుగా మిగిలిందని అన్నారు. కరోనాను కట్టడి చేయడం కష్టమని, దేశ పౌరులే పరిశుభ్రతను పాటించి, వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సహకరించి, తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తేనే కరోనాపై విజయం సాధించవచ్చని ఆమె అన్నారు.

కాగా, గడచిన 15 సంవత్సరాలుగా జర్మనీ చాన్స్ లర్ గా ఉన్న మెర్కెల్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారన్న సంగతి తెలిసిందే. అయినా ఆమె ఎన్నడూ నేరుగా ప్రజలకు సలహాలు, సూచనలు ఇవ్వలేదు. నాలుగేళ్ల క్రితం దేశం ఎదుర్కొన్న శరణార్థుల సమస్య, బ్రెగ్జిట్, ఆర్థిక వ్యవస్థ పతనం వంటి సమస్యలు వచ్చిన వేళ కూడా ఆమె ప్రజలను ఏమీ కోరలేదు.

ఇక ఇప్పుడు మాత్రం ఆమె ప్రజలకు నేరుగా సూచనలు చేశారు. పరిశుభ్రత ప్రధానమని, కరచాలనం వద్దని అన్నారు. ప్రజల ప్రయాణ హక్కులను కాదనడం లేదని, ఇదే సమయంలో పౌరులు ప్రయాణాల నియంత్రణ పాటించాలని అన్నారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ప్రభావం దేశ జీడీపీపై పడకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.


More Telugu News