మాస్క్ లతో పదో తరగతి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

  • తెలంగాణలో ప్రారంభమైన వార్షిక పరీక్షలు 
  • ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న పరీక్షార్థులు 
  • పరీక్షల సమయంలో ఆరోగ్యం ముఖ్యం కదా

కరోనా భయం ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఈరోజు నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశేషం ఏమంటే, పరీక్షకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది మాస్క్ లతో పరీక్షా కేంద్రాలకు రావడం . తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం విద్యా సంస్థలు, హాస్టళ్లకు సెలవు ప్రకటించింది. 

మరోవైపు షాపింగ్ మాళ్లు, ఇతర రద్దీ ప్రాంతాలు మూతపడుతున్నాయి. అయినా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయలేదు. దీంతో పరీక్షలు పూర్తయ్యే వరకు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో పిల్లలకు తల్లిదండ్రులు మాస్క్ లు కట్టి మరీ తీసుకువస్తున్నారు. గంట ముందే పరీక్షా కేంద్రం వద్ద ఉండాలన్న అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులు 8.30 గంటలకే చేరుకున్నారు.

అదే విధంగా పది నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతినిస్తున్నారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులకు మించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారిని ప్రత్యేక గదుల్లో పెట్టి పరీక్ష రాయిస్తున్నారు.



More Telugu News