ఎస్​ఈసీ రమేశ్ కుమార్ పై సీఎం జగన్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: కళా వెంకట్రావు డిమాండ్​

  • వ్యవస్థలు నాశనమైతే ప్రజాస్వామ్యానికి చాలా ముప్పు 
  • రమేశ్ కుమార్ ‘కులం’పై జగన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
  • ఎన్నికల గురించి తప్ప ‘కరోనా’ నివారణపై సీఎం మాట్లాడరే?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది కనుక ఎస్ఈసీ రమేశ్ కుమార్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.

ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యవస్థలు నాశనమైతే ప్రజాస్వామ్యానికి చాలా ముప్పు అని, ప్రజాస్వామ్యం సరైన దిశలో ప్రయాణించకుండా ఆటంకాలు కలిగిస్తే రాష్ట్ర, దేశాభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. అందువల్ల, రాజ్యాంగ వ్యవస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం, దాని కమిషనర్ రమేశ్ కుమార్ ‘కులం’పై జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి జగన్ మాట్లాడతారు తప్పితే, ‘కరోనా’ నివారణ చర్యల గురించి మాట్లాడటం లేదని విమర్శించారు.

విదేశాల నుంచి ఏపీకి వస్తున్న వారికి స్క్రీనింగ్ చేయించిన దాఖలాలు ఉన్నాయా? ఏయే ప్రదేశాల్లో వైద్య పరీక్షలు చేయించారు? క్వారంటైన్ హౌసెస్ లో ఎంత మందిని పెట్టారు? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించుకోవాలో ఆలోచిస్తున్న జగన్, ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. ‘కరోనా’ గురించి ఆగస్టు వరకూ ఆలోచించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారని, ఏపీలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని జగన్ పై మండిపడ్డారు. పరిపాలించడం చేతకాకపోవడం వల్లనే కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని జగన్ చూస్తున్నారని దుమ్మెత్తిపోశారు.


More Telugu News