ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల కోడ్ మాత్రం ఎత్తివేత!

  • తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలన్న సుప్రీంకోర్టు 
  • ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దు చేస్తున్నట్లు ప్రకటన
  • ఎన్నికల తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై ఈసీదే తుది నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే, జస్టిస్‌ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించింది. వాయిదాను కొనసాగించాలని తెలిపింది. 

కరోనా విజృంభణ నేపథ్యంలో తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఉన్న పథకాలను కొనసాగించవచ్చు.. కానీ, కొత్త పథకాలు ప్రారంభించవద్దని తెలిపింది.

ప్రజలను ప్రలోభపెట్టే చర్యలు వద్దని సూచించింది. ఎన్నికలు తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని తెలిపింది. ఈ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, కొత్త పథకాలు ప్రారంభించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం. 


More Telugu News