అమ్మో... ఈ ముగ్గురూ మహా ముదుర్లు: బ్యాంకు కార్డు వివరాలు తెలిస్తే ఖాతా ఖాళీయే!

  • ఒకడు కార్డు వివరాలు తస్కరిస్తే మరొకడు నకిలీ కార్డు తయారు చేస్తాడు
  • ఇంకొకడు ఏటీఎంకు వెళ్లి డబ్బు డ్రా చేస్తాడు
  • ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు

వారి ముగ్గురి చదువు పదో తరగతి లోపే. కానీ ఆధునిక టెక్నాలజీపై పట్టుండడంతో బ్యాంకు ఖాతాదారులను మోసం చేయడంలో జగజ్జట్టీలు. ఒకడు ఖరీదైన పబ్బులు, హోటళ్లలో పనిచేసి డబ్బున్న కస్టమర్ల బ్యాంకు కార్డుల వివరాలు సేకరిస్తాడు. మరొకడు ఆ వివరాలు క్లోనింగ్ చేసి డూప్లికేట్ కార్డు తయారు చేస్తాడు. మరొకడు ఏటీఎంలకు వెళ్లి డబ్బు డ్రా చేసి తెస్తాడు. ఆ మొత్తాన్ని ముగ్గురూ సమానంగా పంచుకుని జల్సాలు చేస్తారు. ఎట్టకేలకు వీరి పాపం పండి పోలీసులకు చిక్కారు.

పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే... ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా మోహాసాయి పెంతో గ్రామానికి చెందిన ప్రపుల్ కుమార్ నాయక్ (25), హేమంత కుమార్ నాయక్ (28), సుజిత్ కుమార్ నాయక్ (31)లు పదేళ్లుగా హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉంటున్నారు. అక్కడ డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలతో నకిలీ కార్డులు తయారు చేయడంపై శిక్షణ పొందారు. తర్వాత క్లోనింగ్ యంత్రాలు సమకూర్చుకున్నారు. అనంతరం ఈజీ మనీ కోసం 2017 నుంచి ఖాతాలు కొల్లగొట్టడం అలవాటుగా మార్చుకున్నారు.

 హేమంత్ కుమార్ నాయక్ ఖరీదైన రెస్టారెంట్లు, పబ్బుల్లో వారం, పది రోజులు మాత్రమే బేరర్‌గా పనిచేసేవాడు. ఆ తర్వాత మూడు నెలలపాటు కనిపించేవాడు కాదు. తాను పనిచేసినప్పుడు కస్టమర్లు బిల్లు చెల్లించే సందర్భంలో ఇచ్చిన కార్డు, పిన్ నంబర్ వివరాలు గుర్తుపెట్టుకునేవాడు. తాను సేకరించిన వివరాలను ప్రపుల్ కుమార్ నాయక్ కు అందజేసేవాడు. అతడు క్లోనింగ్ చేసి నకిలీ కార్డు అందజేస్తే సుజిత్ కుమార్ ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసేవాడు.

దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్న వీరి మోసాలకు పోలీసులు బ్రేక్ వేశారు. హైదరాబాదు, యూసుఫ్ గూడ జూబ్లీహిల్స్ ఏటీఎం నుంచి రూ.76 వేలు విత్ డ్రా అయినట్లు గచ్చిబౌలి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మేనేజర్ ఈనెల 5న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొత్తం డొంకంతా కదిలించి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.



More Telugu News