ఇండియాలో కరోనా వైరస్ తాజా అప్ డేట్!

  • 163 దేశాలకు విస్తరించిన వైరస్
  • ఇండియాలో 142 పాజిటివ్ కేసులు
  • అత్యధికంగా మహారాష్ట్రలో, ఆపై కేరళలో
ప్రపంచవ్యాప్తంగా 163 దేశాల్లో విస్తరించిన కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మోగిస్తున్న వేళ, ఇండియాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 142 ఉన్నాయని అధికారిక ప్రకటన విడుదలైంది. మహారాష్ట్రపై వైరస్ ప్రభావం అత్యధికంగా ఉండగా, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ 39 కేసులు నమోదయ్యాయి. ఆపై రెండో స్థానంలో తొలి కేసు వెలుగుచూసిన కేరళ నిలిచింది. కేరళలో 26 కేసులు నమోదయ్యాయి.

ఆ తరువాత ఉత్తరప్రదేశ్ లో 15, హర్యానాలో 15, కర్ణాటకలో 11, ఢిల్లీలో 8, లడఖ్ లో 6, తెలంగాణలో 5, రాజస్థాన్ లో 4, జమ్ము కశ్మీర్ లో 3 కేసులున్నాయని, ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

కాగా, ఇంతవరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 7,965కు చేరగా, 1,98,178 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతున్న వారిలో 7,020 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు పరిశీలిస్తే, చైనాలో 3,237, ఇటలీలో 2,503, ఇరాన్ లో 988, స్పెయిన్ లో 533, ఫ్రాన్స్ లో 175, అమెరికాలో 109, దక్షిణ కొరియాలో 84, యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)లో 71, నెదర్లాండ్స్ లో 43, జపాన్ లో 29 మంది చనిపోయారు.


More Telugu News