నా బయోపిక్‌కి ‘గల్లీ బాయ్‌’ కుర్రాడైతే బెటర్!: యువరాజ్

  • బాలీవుడ్‌లో ఈ మధ్య స్పోర్ట్స్‌ బయోపిక్‌ల హవా 
  • యువీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాపై చర్చలు
  • తన పాత్రలో సిద్ధాంత్‌ చతుర్వేది బాగుంటాడన్న యువీ
బాలీవుడ్‌లో ఈ మధ్య బయోపిక్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కోట్ల వర్షం కురిపిస్తున్నాయి. మేరీకోమ్‌, భాగ్ మిల్కా భాగ్ నుంచి ఎంఎస్‌ ధోనీ, సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ వరకూ అన్ని సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బయోపిక్‌ పట్టాలెక్కితే తన పాత్రలో ఏ నటుడు అయితే బాగుంటుందో యువీ చెప్పాడు.

నిజానికి సినిమాలో తన పాత్రలో తానే నటించాలని ఉందని యువీ అభిప్రాయపడ్డాడు. కానీ అది సాధ్యం కాకపోవచ్చని అన్నాడు. నటుడిని నిర్ణయించే అధికారం డైరెక్టర్‌‌దే అన్న యువీ.. ఒకవేళ ఇది బాలీవుడ్‌ చిత్రం అయితే సిద్దాంత్‌ చతుర్వేది మంచి ఆప్షన్ అని తెలిపాడు. తన పాత్రలో సిద్ధాంత్‌ను చూసేందుకు ఇష్టపడతానని యువీ పేర్కొన్నాడు.

కాగా, బాలీవుడ్‌లో పెద్ద హిట్‌ అయిన ‘గల్లీ బాయ్‌’ చిత్రంతో సిద్ధాంత్ స్టార్‌‌డమ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో అతను పోషించిన ఎమ్సీ షేర్ పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే, అతనికి ఫిల్మ్‌ ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇక, అమెజాన్‌ వెబ్‌ సిరీస్‌ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’లోనూ సిద్ధాంత్‌ క్రికెటర్‌‌ పాత్రలో నటించి మెప్పించాడు. మరి, యువీ బయోపిక్‌ పట్టాలెక్కితే.. అందులో మాజీ క్రికెటరే నటిస్తాడో.. లేక సిద్ధాంత్‌ అతని పాత్రను పోషిస్తాడో చూడాలి.


More Telugu News