దేశ పౌరులకు సూచనలు, తీవ్ర హెచ్చరికలను జారీ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

  • పౌరుల కదలికలపై మరో 15 రోజుల తీవ్ర ఆంక్షలు ఉంటాయి
  • ప్రభుత్వ హెచ్చరికలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
  • ప్రస్తుతం మనం యుద్ధ రంగంలో ఉన్నాం
యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీలపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫ్రాన్స్ లో గత 24 గంటల్లో మరో 21 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 148కి పెరిగింది. ఇదే సమయంలో 1,210 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ తన దేశ పౌరులకు కీలక సూచనలు, హెచ్చరికలను జారీ చేశారు. పౌరుల కదలికలపై కనీసం మరో 15 రోజులు తీవ్ర ఆంక్షలు ఉంటాయని ఆయన చెప్పారు. ఇతరులను కలవడాన్ని ప్రతి ఒక్కరూ పూర్తిగా తగ్గించుకోవాలని హెచ్చరించారు. యూరోపియన్ యూనియన్ సరిహద్దులను 30 రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోకుండా వారాంతంలో చాలా మంది గుంపులుగా గడపారని మాక్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య అధికారుల హెచ్చరికలను కూడా కాదని... పార్కులు, మార్కెట్లు, రెస్టారెంట్లు, బార్లలో గడిపారని తెలిపారు. కొందరు చేసే ఇలాంటి పనుల వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి పనులను కొనసాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రభావితమయ్యే ప్రమాదం ఉందనే అంశంపై ఆయన స్పందిస్తూ, ఏ ఒక్క కంపెనీ కూడా దివాళా గురించి చింతించవద్దని చెప్పారు. ట్యాక్సులు, ఇతర చార్జీలను కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. కంపెనీలకు బ్యాంకులు ఇచ్చే లోన్లకు ప్రభుత్వం ష్యూరిటీగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మనమంతా ప్రస్తుతం యుద్ధరంగంలో ఉన్నామని... ఈ మహమ్మారిని ఎదుర్కోవడంపై ప్రభుత్వం, పార్లమెంటు దృష్టిని సారిస్తుందని చెప్పారు.


More Telugu News