కరోనా విజృంభణ... ఒక్క రోజులోనే 14 వేల కేసులు: డబ్ల్యూహెచ్ఓ ప్రకటనతో తీవ్ర ఆందోళన!

  • నిన్న ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 862 మరణాలు
  • 1,67,500కు పెరిగిన కరోనా కేసులు
  • అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 వేల కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 1,67,500కి పెరిగిందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,606కు పెరిగిందని... గత 24 గంటల్లో 862 మంది చనిపోయారని తెలిపింది. ఇండియాతో పాటు 130 దేశాలకు ఈ వైరస్ పాకిందని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు దేశంలో కరోనా విస్తరిస్తుండటంతో అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచనలు జారీ చేసింది. సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు, మ్యూజియంలు, జిమ్ లు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈత కొలనులను మూసివేయాలని ఆదేశించింది. విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాలని, ఆన్ లైన్ విద్యను ప్రోత్సహించాలని తెలిపింది. ప్రజలు ఒకరికొకరు దూరంగా ఉండటమే మేలని చెప్పింది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర చర్యలు ఏవైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని సూచించింది.


More Telugu News