ఎన్నికల వాయిదా మంచిదే.. కానీ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది: వైసీపీ ఎంపీ

  • కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయడం మంచిదే
  • కానీ ఎన్నికలు జరిగితేనే 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి
  • ఎన్నికల వాయిదాతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుంది
కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు, ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయడం మంచిదే అని సంజీవకుమార్ చెప్పారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే 14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. ఎన్నికలు వాయిదా పడటంతో రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరిగినట్టేనని చెప్పారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో జరిగిన ఓ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News