కరోనా లక్షణాలతో ఒకావిడ చనిపోయిందంటున్నారు... ఎన్నికలు కావాలా మీకు?: చంద్రబాబు

  • తూర్పుగోదావరిలో మహిళ మృతి
  • పరిస్థితి విషమించకముందే చర్యలు తీసుకోవాలి 
  • జగన్ మొండివైఖరి వీడాలని హితవు
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన చంద్రబాబు కరోనా వైరస్ వ్యాప్తిపై ఏపీ సర్కారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చెప్పాలని నిలదీశారు. కాకినాడ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ కరోనా లక్షణాలతో ఒకావిడ మృతి చెందినట్టు తెలిసిందని, ఈ ప్రభుత్వం మాత్రం ఎన్నికలు కావాలంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు వచ్చారని తెలిసిందని, కానీ ఏ ఒక్క అధికారి వాళ్ల విషయంలో చర్యలు తీసుకోలేదని అన్నారు.

"ఎంతో ప్రమాదకర పరిస్థితిలో సైతం ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ముఖ్యమంత్రి ఎన్నికలు ఎలా నిర్వహించాలా అని రమాకాంత్ రెడ్డిని పిలిపించి చర్చిస్తున్నాడు. ఏంటి నీ పైశాచిక ఆనందం? సుప్రీం కోర్టు అత్యవసర కేసులు తప్ప ఇతర కేసుల్లో ప్రత్యక్ష విచారణలు జరుపబోమని, వర్చువల్ కోర్టులకు ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. భారత్ మొత్తం మూతపడింది. నువ్వు మాత్రం ఇంకా ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టుకు వెళతావా? నీకెలాగూ బాధ్యతలేదు, బాధ్యతతో వ్యవహరించిన ఎన్నికల సంఘం మీదికి వెళతావా?" అంటూ మండిపడ్డారు.

"ఎన్నికల్లో గెలిచాం అనిపించుకోవాలన్నదే సీఎం ప్రయత్నంలా ఉంది. కానీ తన ప్రయత్నంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కొనాలి. కోట్ల మంది ప్రజల ఆరోగ్యంతో కూడిన విషయం ఇది. రాబోయే రెండు, మూడు వారాలు ఎంతో కీలకం. ఇప్పుడు గనుక అప్రమత్తం కాకపోతే భారత్ లో దీన్ని నియంత్రించడం సాధ్యంకాని పని అని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎన్నికలపై ఉండే ధ్యాసలో పది శాతం ప్రజల ఆరోగ్యంపై ఉందా? అని అడుగుతున్నా. ఇకనైనా సీఎం మొండి వైఖరి వీడాలి. వితండవాదం వద్దు, మీపై ఉన్న బాధ్యతను నెరవేర్చండి" అంటూ హితవు పలికారు.

అంతేకాదు, సీఎస్ నీలం సాహ్నీపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఎస్ లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. "సీఎం పేషీ రాయమంటే మీరు రాస్తారా? ఎందుకిలాంటి దౌర్భాగ్యకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రపంచమంతా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటే వాళ్లందరూ తెలివితక్కువాళ్లయ్యారా? ఈమె ఒక్కతే తెలివైనవారా? దీనికంతటికీ కారణం జగన్. పదవి కోసం కక్కుర్తిపడి పైశాచికంగా వ్యవహరించవద్దు. అప్పట్లో నేను డెంగ్యూ వస్తే దోమలపై యుద్ధం ప్రకటించాను. కానీ నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు కరోనాపైనా చులకన చేస్తున్నారు. ఇది మీ చేతుల్లో లేదు. మీ చేతిలో లేనిదానిని నియంత్రిస్తామంటూ బీరాలు పలకడం మానండి" అంటూ హెచ్చరించారు.


More Telugu News