కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీలో యాభై మంది ఒకే చోట గుమికూడడంపై నిషేధం!

  • యాభై మందికి మించిన సమావేశాలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం
  • ఈ 31 వరకు ఆంక్షలు విధిస్తున్నట్ట  సీఎం కేజ్రీవాల్ ప్రకటన
  • వివాహాలు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరిన సీఎం
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలోని ఏ ప్రదేశంలోనూ కూడా యాభై మంది కంటే ఎక్కువ మంది ప్రజలు సమూహంగా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. యాభై మందికి మించిన మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే ఈ నెలాఖరు వరకు ఢిల్లీలో జిమ్ములు, నైట్ క్లబ్బులు, స్పాలను కూడా మూసివేస్తున్నామని తెలిపారు.

వివాహాలకు ఆటంకం లేదు

ర్యాలీలు, సమావేశాలపై ఆంక్షలు విధించినప్పటికీ రాష్ట్రంలో జరిగే వివాహాలకు హాజరయ్యేవారిపై ఎలాంటి పరిమితి లేదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని వాయిదా వేసుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు. ఇక, కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆటోలు, ట్యాక్సీలను ఉచితంగా శుద్ధి చేయాలని (డిస్ఇన్ఫెక్ట్) నిర్ణయించారు. అలాగే, ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలిందని, వారిలో నలుగురు ఇంకా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేజ్రీవాల్ తెలిపారు. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే అందుకు తగినన్ని పడకలు సిద్ధం చేశామన్నారు. అలాగే, లెమన్‌ ట్రీ, రెడ్ ఫాక్స్, ఐబిస్ హోట్లళ్లలో క్వారెంటైన్ సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీలో ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, సిమ్మింగ్‌ పూల్స్ ను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయించారు.


More Telugu News