ఏపీ పరిస్థితి ఫ్రాన్స్ కంటే దారుణంగా ఉందా?: మంత్రి అనిల్ కుమార్

  • కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయడం బాధాకరమన్న అనిల్
  • ఫ్రాన్స్ లో కరోనాతో 127 మంది చనిపోయారని వెల్లడి
  • ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలని డిమాండ్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తారని తాము ఊహించలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, ఫ్రాన్స్ లో 127 మంది కరోనా కారణంగా చనిపోయారని, 5,500 కరోనా కేసులు నమోదయ్యాయని, అయినా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని వెల్లడించారు. ఏపీలో ఫ్రాన్స్ కంటే దారుణంగా ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఓ వ్యక్తికి మేలు చేసేందుకో, తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగు కోసమో ఎన్నికల కమిషనర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారించదగ్గ విషయం అని అభిప్రాయపడ్డారు. ఈసీకి విచక్షణాధికారం ఉన్న మాట వాస్తవమేనని, అయితే తాజా నిర్ణయం విచక్షణ కోల్పోయి తీసుకున్నట్టు తెలుస్తోందని విమర్శించారు. విపక్షాలు తమ అభ్యర్థులను బరిలో నిలపలేక, ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ను అడ్డంపెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News