ఎస్​ఈసీ నిర్ణయంలో దురుద్దేశం కనపడుతోంది: సజ్జల రామకృష్ణారెడ్డి

  • ఎన్నికలు వాయిదా వేయడంపై మండిపాటు
  • ఎన్నికల సంఘం అనేది ఒక వ్యక్తి కాదు వ్యవస్థ
  • ఎవరో చెబితేనే ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం దురుద్దేశపూర్వకంగా ఉందని ఆరోపించారు. ఎన్నికల సంఘం అనేది ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని, ఎన్నికల సంఘానికి ఏమైనా వార్తలు వచ్చి ఉంటే కనుక సీఎస్, హెల్త్ సెక్రటరీని పిలిచి మాట్లాడాలని, అలా జరగలేదని విమర్శించారు. ఎవరో చెబితేనే ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారనే అనుమానం వస్తోందని అన్నారు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయదలిస్తే, ప్రభుత్వం అభిప్రాయం అడగాలని, రాజకీయపార్టీల సంప్రదింపులు జరపాలని, అవేవీ లేకుండా వాయిదా వేస్తారా? అని ప్రశ్నించారు.

ఎన్నికల కమిషనర్ ప్రస్తావించిన జడ్జిమెంట్ లోనూ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలనే ఉందని అన్నారు. రమేశ్ కుమార్ కు నిబద్ధత ఉంటే ప్రభుత్వంతో చర్చించే వారు కానీ ఆయనపై ఏదో ఒత్తిడి పని చేసిందని అనుమానం వ్యక్తం చేశారు. రమేశ్ కుమార్ తన పరిధిని మించి నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉంటే గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు ప్రజాప్రతినిధులు కలిసి సుపరిపాలన అందించే అవకాశం ఉండేదని, కేంద్రం నుంచి రావాల్సిన రూ.5 వేల కోట్ల నిధులు కూడా రాష్ట్రానికి వచ్చేవని అన్నారు.


More Telugu News