ఎన్నికల వాయిదాకు కారణం ‘కరోనా’ కాదు ‘క్యాస్ట్​ వైరస్’: అంబటి రాంబాబు

  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు సపోర్ట్ చేస్తే సరిపోతుందా?
  • ఎన్నికలు వాయిదా పడాలని వాళ్లిద్దరికీ ఉంటే చాలా?
  • ‘చౌదరి గారు’ ప్రయత్నించారు..‘చంద్రబాబు గారు’ వత్తాసు పలికారు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ రమేశ్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అంత విచ్చలవిడిగా ‘కరోనా’ ఉందా? ఏ అధికారులతో మాట్లాడి రమేశ్ కుమార్ చౌదరి నివేదిక తెప్పించుకున్నారు? ఎవరితో సంప్రదించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు సపోర్ట్ చేస్తే సరిపోతుందా? ఎన్నికలు వాయిదా పడాలని వాళ్లిద్దరికీ ఉంటే చాలా? అని ప్రశ్నించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటానికి కారణం కరోనా వైరస్ కాదు ‘క్యాస్ట్ వైరస్’ మాత్రమే అని, ‘చౌదరి గారు’ ప్రయత్నం చేస్తే, ‘చంద్రబాబునాయుడు గారు’ వత్తాసు పలుకుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకోవడానికి ఏవిధంగా కసరత్తు చేశారో రమేశ్ కుమార్ చెప్పాలని డిమాండ్ చేశారు.

‘కరోనా’ గ్లోబల్ వైరస్ గా మారిందన్న విషయం వాస్తవమే కానీ, ఏపీలో పరిస్థితి వేరని, ఒకే ఒక్క కేసు రిజిష్టరైందని అన్నారు. ‘కరోనా’ నివారణకు మందు కనిపెట్టే వరకూ ఎన్నికలు జరగవా? ఏపీలో’ కరోనా’ రూట్ అవుట్ అయ్యే వరకు ఎన్నికలు జరగవా? అని ప్రశ్నించారు. ఎన్నికల వాయిదా కుట్రలో రమేశ్ కుమార్ చౌదరి, చంద్రబాబు భాగస్వాములని, ఇందులో ఇంకా కుట్రదారులెవరో బయటకొస్తారని అన్నారు.


More Telugu News