ఇప్పుడు ఎన్నికలు జరిగుంటే కేంద్రం నుంచి రూ.4 వేల కోట్లు వచ్చేవి: పేర్ని నాని

  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
  • దీనివెనుక కుట్ర ఉందన్న పేర్ని నాని
  • అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవుతాయని ధీమా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడడంపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న హంగామా సృష్టిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేసినట్టు తెలుస్తోందని, ఒక్క కరోనా కేసును చూపి వాయిదా వేయడం వెనుక కుట్ర దాగివుందని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగుంటే కేంద్రం నుంచి రూ.4 వేల కోట్ల నిధులు వచ్చేవని అన్నారు. ఎన్నికలు వాయిదా పడితే ఫలితాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, ఎన్ని కుట్రలు చేసినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని పేర్కొన్నారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం స్థానిక సంస్థల కోటాలో రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల నిధులను నిలిపివేసింది. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తయితే ఆ నిధులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. కానీ ఎస్ఈసీ నిర్ణయంతో ఏపీ సర్కారుకు నిరాశకు గురైనట్టు పేర్ని నాని వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.


More Telugu News