కరోనాతో హడలెత్తిపోతున్న స్పెయిన్.. ఒకే రోజు 1500 కేసుల నమోదు!

  • స్పెయిన్‌లో శరవేగంగా విస్తరిస్తున్న వైరస్
  • ఇప్పటి వరకు 120 మంది మృతి
  • అత్యవసర పరిస్థితి విధించిన ప్రభుత్వం
కరోనా వైరస్ ఇప్పుడు స్పెయిన్‌ను భయపెడుతోంది. దేశంలో శరవేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. సాక్షాత్తూ ఆ దేశ మంత్రి ఇరేనే మాంటెరో కూడా వైరస్ బారిన పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు, గత 24 గంటల్లో ఏకంగా 1500 కొత్త కరోనా కేసులు నమోదు కావడం మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 5,753కు చేరుకుంది. వీటిలో దాదాపు మూడు వేల మంది బాధితులు దేశ రాజధాని మాడ్రిడ్‌కు చెందినవారే కావడం గమనార్హం.

కాగా, శుక్రవారం నాటికి ఆ దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 120కి చేరుకుంది. మరోవైపు ఒకే రోజు 1500 కేసులు నమోదు కావడంతో క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. రెండు వారాలపాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించింది.


More Telugu News