నేను చెబుతున్నా... గ్రామీణ తెలంగాణకు కరోనా సోకదు: కేసీఆర్

  • నిన్న మూడు గంటల పాటు క్యాబినెట్ సమావేశం
  • కరోనా హైదరాబాద్ చుట్టుపక్కలకే పరిమితం
  • 200 మంది ఆరోగ్య సిబ్బంది ఎయిర్ పోర్టులో ఉన్నారన్న కేసీఆర్
తెలంగాణలోని పల్లె ప్రాంతాలకు కరోనా వైరస్ సోకే అవకాశాలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న దాదాపు మూడు గంటల పాటు క్యాబినెట్ సహచరులతో సమావేశమైన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాధి ఇండియాలోనో, తెలంగాణలోనో పుట్టినది కాదని కేసీఆర్ అన్నారు. విదేశాల నుంచి వస్తున్న వ్యాధి కాబట్టి దేశీయంగా ప్రమాదం లేదని భరోసా ఇచ్చారు.

విమానాశ్రయాలు, నౌకాశ్రయాల వద్దే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, తెలంగాణకు సముద్రం లేదు కాబట్టి పోర్టుల సమస్య లేదని, హైదరాబాద్‌ లోనే ఎయిర్ పోర్టు ఉన్నందున కరోనా వైరస్‌ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సోకే అవకాశమే లేదని, ఈ విషయంలో తనది భరోసా అని అన్నారు.

ప్రజలు భయాలు, ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, శంషాబాద్ లోని ఎయిర్‌ పోర్టులో 200 మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది, కేంద్రం పంపిన అధికారులు ఉన్నారని, వ్యాధి ప్రబలకుండా వారు స్క్రీనింగ్‌ చేస్తున్నారని కేసీఆర్‌ తెలిపారు.
.


More Telugu News