కివీస్ క్రికెటర్ కు ఊరట... కరోనా లేదని రిపోర్టులో వెల్లడి!

  • గొంతునొప్పిగా ఉందన్న న్యూజిలాండ్ పేసర్ ఫెర్గుసన్
  • కరోనా వైద్య పరీక్షలు నిర్వహించిన జట్టు యాజమాన్యం
  • సిడ్నీ హోటల్లో ఐసోలేషన్
  • కరోనా నెగెటివ్ అని రావడంతో రేపు స్వదేశానికి వెళ్లనున్న ఫెర్గుసన్
కరోనా మహమ్మారి క్రికెటర్లలోనూ కలవరం పుట్టిస్తోంది. నిన్న ఆసీస్ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ కు కరోనా ఉందేమోనంటూ వైద్యపరీక్షలు చేసి ఏమీ లేదని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా కివీస్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ కూడా కరోనా అనుమానితుల జాబితాలో చేరాడు. సిడ్నీలో ఆసీస్ తో తొలి వన్డే ముగిసిన అనంతరం ఫెర్గుసన్ గొంతు నొప్పిగా ఉందని చెప్పడంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇప్పుడా పరీక్షల తాలూకు రిపోర్టు రాగా, అందులో ఫెర్గుసన్ కు కరోనా లేదని వెల్లడైంది. దాంతో ఈ క్రికెటర్ ను స్వదేశం వెళ్లేందుకు అనుమతించారు. గొంతు నొప్పి అనడంతో ఫెర్గుసన్ ను సిడ్నీలోని హోటల్లోనే విడిగా ఓ గదిలో ఉంచారు. ఇప్పుడతను న్యూజిలాండ్ వెళ్లేందుకు అడ్డంకి తొలగిపోయింది. లాకీ ఫెర్గుసన్ రేపు న్యూజిలాండ్ చేరుకుంటాడని ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.


More Telugu News