రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు: డీజీపీ

  • ఇప్పటివరకు పెద్ద ఘటనలేవీ జరగలేదన్న డీజీపీ
  • సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడి
  • మాచర్ల నిందితులను రిమాండ్ కు పంపామని వివరణ
ఏపీ పోలీసులపైనా, డీజీపీపైనా టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్నట్టు భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని అన్నారు.

'అది జరిగింది, ఇది జరిగింది' అంటూ సాధారణ ఘటనలను కూడా పెద్దవి చేసి చూపడం ఓ దురలవాటుగా మారిందని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పెద్ద ఘటనలేవీ జరగలేదని పేర్కొన్నారు. చెదురుమదురుగా 43 ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మాచర్ల ఘటనలో నిందితులను రిమాండ్ కు పంపినట్టు డీజీపీ వెల్లడించారు. న్యాయవాది గాయపడిన ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారని వివరించారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం గురించి మాట్లాడవద్దంటూ మీడియా ప్రతినిధులకు సూచించారు. చంద్రబాబును విశాఖలో అడ్డుకోవడం తదితర పరిణామాలపై హైకోర్టులో విచారణ జరగ్గా, డీజీపీని సైతం హైకోర్టు తమ సమక్షానికి పిలిపించి వివరణ అడిగిన సంగతి తెలిసిందే.


More Telugu News