కరోనా దెబ్బకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ కూడా రద్దు

  • శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే
  • మిగతా రెండు వన్డేలను రద్దు చేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన
  • వెంటనే స్వదేశానికి వెళ్లనున్న న్యూజిలాండ్‌ జట్టు
కరోనా వైరస్ దెబ్బకు క్రీడా ప్రపంచం కుదేలవుతోంది. ముఖ్యంగా క్రికెట్‌పై ఆ వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మరో సిరీస్‌ కూడా రద్దయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌ అర్థాంతరంగా ఆగిపోయింది.

ఈ సిరీస్‌లో శుక్రవారం ఇరు జట్లు ఖాళీ స్టేడియంలో తొలి వన్డే ఆడగా.. మిగతా రెండు వన్డేలను వాయిదా వేశారు. తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ ప్రభుత్వం తాజాగా పలు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో కివీస్ జట్టు వెంటనే స్వదేశానికి పయనం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో, సిరీస్‌లో మిగతా రెండు వన్డేలను రద్దు చేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. భవిష్యత్‌లో ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు రెండు దేశాల బోర్డులు ప్రయత్నిస్తాయని చెప్పింది.

కాగా, కరోనా కారణంగా ఐపీఎల్‌ను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేయగా, భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌ కూడా రద్దయింది. శ్రీలంక పర్యటనను ఇంగ్లండ్‌ జట్టు అర్థాంతరంగా ముగించుకొని స్వదేశానికి బయల్దేరింది.


More Telugu News