కరోనా ఎఫెక్ట్.. చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ ప్రాక్టీస్‌ రద్దు

  • ఈ నెల 2 నుంచి చెపాక్‌ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్‌ చేస్తున్న సీఎస్‌కే
  • కరోనా నేపథ్యంలో సెషన్స్‌ రద్దు చేసిన యాజమాన్యం
  • సొంత నగరాలకు క్రికెటర్ల తిరుగు ప్రయాణం
ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం జోరుగా సమాయత్తం అవుతున్న చెన్నై సూపర్‌‌ కింగ్స్‌కు కరోనా వైరస్‌ షాకిచ్చింది. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ తేదీ వాయిదా పడగా.. చెన్నై జట్టు ప్రాక్టీస్‌ సెషన్స్‌ కూడా రద్దయ్యాయి. ఈ నెల రెండో తేదీ నుంచి  చెన్నై చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. ధోనీతో పాటు సురేశ్ రైనా, అంబటి రాయుడు, మురళీ విజయ్, హర్భజన్ సింగ్‌ తదితర  క్రికెటర్లు నెట్ సెషన్స్‌తో పాటు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతున్నారు. తొలుత ప్రేక్షకులను కూడా అనుమతించగా.. వేల సంఖ్యలో ఫ్యాన్స్‌ స్టేడియానికి వచ్చారు.

అయితే, కరోనా నేపథ్యంలో కొన్ని రోజులగా ఖాళీ స్టేడియంలో చెన్నై జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. కానీ, దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడగా.. చెన్నై యాజమాన్యం కూడా ప్రాక్టీస్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. దాంతో, ఆటగాళ్లంతా తమ సొంత ప్రదేశాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.


More Telugu News