భీమిలి సమీపంలో నా భూమిని కూడా కొట్టేయాలని ప్రయత్నించారు: కన్నా

  • విశాఖలో భూమాఫియాకు వందలమంది బలయ్యారన్న కన్నా
  • భూ యజమానులు భయపడుతున్నారని వ్యాఖ్యలు
  • తుపాకీ ఎక్కుపెట్టి సెటిల్ మెంట్లు చేస్తున్నారని వెల్లడి
తన భూమిపైనా కబ్జాసురుల కన్ను పడిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమిలి సమీపంలో ఉన్న తన భూమిని కొట్టేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. 1993లో చేపలుప్పాడలో స్థలం కొన్నానని, తన స్థలం పక్కనే ఓ పోలీసు అధికారం స్థలం కూడా ఉందని, ఆ రెండు స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయం తెలిసిన పోలీసు అధికారి తనకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యానని కన్నా వివరించారు. ఇదేంటని కబ్జాదారులను ప్రశ్నిస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థలం అనుకోలేదని చెప్పారని వెల్లడించారు.

"విశాఖలో మన భూములను ఎవరో ఆక్రమించుకుంటున్నారండీ అని పోలీసు అధికారి ఫోన్ చేశారు. మా మనిషిని పంపిస్తున్నాను, మీరు కూడా మీ మనిషిని అక్కడికి పంపించండి అని చెప్పారు. వెళ్లిచూస్తే అప్పటికే అక్కడ ఫెన్సింగ్ వేసేశారు. గట్టిగా అడిగితే, ఇది సార్ స్థలం అనుకోలేదని అన్నారు" అంటూ వివరించారు. విశాఖలో భూమాఫియాకు వందలాది మంది బలయ్యారని ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలు చూసి, విశాఖలోని భూ యజమానులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తుపాకీ ఎక్కుపెట్టి సెటిల్ మెంట్లు చేస్తున్నారని అన్నారు. విశాఖపట్నంలోనే కాదు విజయనగరం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. 


More Telugu News