పార్టీలోకి వచ్చినోళ్లు మళ్లీ పారిపోతారని నాకు తెలుసు.. అలాంటి వారు నాకు అవసరం లేదు: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • నేను ఆ రోజున కేవలం యువతను నమ్మి పార్టీ పెట్టాను  
  • కొందరు ఒక్క అరుపు అరిస్తే పారిపోతారు
  • అంతటి పిరికి వారు అయిపోయారు ఈ సమాజంలో. 
  • పిడుగు మీద పడ్డా, ఫిరంగి వచ్చి తగిలినా నిలబడగలిగే వారు కావాలి
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో పార్టీ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. 'నాకు మంచి యాక్టింగ్ కెరీర్ ఉంది. నిజజీవిత పరిస్థితులపై మాట్లాడితే కొందరు కొడతారనే భయం నాకు లేదు. ప్రాణాలు తీస్తారన్న భయం లేదు. నేను పార్టీ పెట్టిన సమయంలో నాతో మేధావులు ఎవరూ లేరు'  

'నాతో ఏకీభవించే వారు లేరు. కులాలు కలుపుకుని రాజకీయాలు చేద్దామని కొందరు వచ్చారు. కానీ, నేను ఆ రోజున కేవలం యువతను నమ్మాను. నాకు తెలుసు, పార్టీలోకి వచ్చినోళ్లు మళ్లీ పారిపోతారని తెలుసు.. ఒక్క అరుపు అరిస్తే పారిపోతారు.. అంతటి పిరికి వారు అయిపోయారు ఈ సమాజంలో. నాకు అలాంటి వారు అవసరం లేదు' అని పవన్ తెలిపారు.

'పిడుగు మీద పడ్డా, ఫిరంగి వచ్చి తగిలినా గుండె ధైర్యం చూపుతూ నిలబడగలిగే వారు కావాలి. రాజమండ్రిలో కవాతు చేసినప్పుడు పది లక్షల మంది వచ్చారు. అయితే, వారు ఓటు ఎవరికి వేశారు? నేరాలకు పాల్పడేవారికి వేశారు.. ఓటమిని అంగీకరించడం ఎంత కష్టమో నన్ను అడగండి చెబుతాను' అని చెప్పారు.

'ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం కావాలి. ఓటమిని అంగీకరించి నిలబడాలి. నేరస్తులను ప్రోత్సహించని రాజకీయాలు చేయాలి. ఇన్ని నీతులతో రాజకీయాలు చేస్తే నిలబడగలమా? అని కొందరు భావిస్తుంటారు. కచ్చితంగా నిలబడతాం' అని పవన్ తెలిపారు.


More Telugu News