అందుకే నేను 2014లో పార్టీ పెట్టాల్సి వచ్చింది: జనసేన అధినేత పవన్ కల్యాణ్

  • ఒక ప్రాంతంలోని నాయకులంతా మరో ప్రాంతంలోని ప్రజలను తిట్టారు
  • విచక్షణారహితంగా తిడుతుంటే ఒక్కరు కూడా మాట్లాడట్లేదు
  • అప్పట్లో ఆంధ్రాపాలకులు తప్పులు చేశారు
  • వారి పాలసీలకు ఆంధ్రప్రజలకు తిడతారేంటీ? అని నేను ఆలోచించాను 
తాను ఎందుకు పార్టీ పెట్టాననే విషయాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 'తండ్రులు, బంధువులు ముఖ్యమంత్రులుగా ఉన్న కుటుంబం నుంచి నేను రాజీకాయల్లోకి రాలేదు. 2014లో నేను రాజకీయాల్లోకి రావడానికి కారణముంది' అని చెప్పారు.

'ఒక ప్రాంతంలోని నాయకులంతా మరో ప్రాంతంలోని ప్రజలను విచక్షణారహితంగా తిడుతుంటే ఒక్కరు కూడా మాట్లాడట్లేదు.. భయపడిపోయారు. ఈ రోజు వైసీపీ చేస్తోన్న తప్పు ప్రజలందరిదీ ఎలా అవుతుంది? ఒక పాలక వర్గం చేస్తోన్న తప్పులు ప్రజలందరికీ అంటగడితే ఎలా? అలాగే, అప్పట్లో ఆంధ్రాపాలకుల తప్పులకు, వారి పాలసీలకు ఆంధ్రప్రజలకు తిడతారేంటీ? అని నేను ఆలోచించాను' అని చెప్పారు.

'దీనిపై ఏ నాయకుడూ మాట్లాడలేదు. వారికి ఈ పరిస్థితి అర్థంకాక కాదు. మాట్లాడితే దాడులు చేస్తారేమోనని వారి భయం. సమాజంలోని మనుషుల్లో ధైర్యం లేదు.. చచ్చిపోయింది. నేను జనసేన పార్టీ పెట్టడానికి కారణం ఈ పిరికి సమాజానికి నూరిపోయడానికే వచ్చాను' అని పవన్ తెలిపారు.

'ముఖ్యమంత్రిని అవుతానో తెలియదు. పార్టీ ముందుకు వెళ్తుందో తెలియదు. కానీ, ప్రజల్లో ధైర్యం నింపడానికే పార్టీ పెట్టాను. నేరస్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. గాంధీ, అంబేద్కర్ లాంటి వారిని పూజిస్తాం. అయితే, ఎన్నికల్లో ఎన్నుకుంటున్నది మాత్రం నేరస్తులని' అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.


More Telugu News