కరోనా వైరస్ నేపథ్యంలో కేసీఆర్ కీలక ప్రకటన!

  • సభలు, సమావేశాలు నిర్వహించొద్దు
  • ప్రతి వందేళ్లకు ఒకసారి ఇలాంటి వ్యాధులు ప్రపంచాన్ని వణికిస్తాయి
  • దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది
కరోనా వైరస్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సభలు, సమావేశాలను నిర్వహించవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరపున కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని... వైరస్ పై ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని... ఇద్దరు మరణించారని చెప్పారు. ప్రపంచాన్ని ప్రతి వందేళ్లకు ఒకసారి ఇలాంటి వ్యాధులు వణికిస్తాయని అన్నారు.

ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో... గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. బయటి దేశం నుంచి వచ్చిన వాళ్లకే కరోనా వస్తోందని తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తుల శాంపిళ్లను పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించామని చెప్పారు. కరోనా ప్రభావం ఉన్న దేశాల నుంచి మన దేశానికి ఎవరొచ్చినా... వారిని 14 రోజులు ఐసొలేషన్ లో ఉంచుతున్నారని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో 200 మంది ఆరోగ్యశాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.


More Telugu News