అడ్డగోలు సంపాదనకు 'అశ్లీల' మార్గం.. పోలీసులకు చిక్కిన కేటుగాడు!
- డేటింగ్ యాప్ లో అమ్మాయిల నగ్న ఫొటోలు, ఫోన్ నంబరు
- సంప్రదించిన వారి నుంచి డబ్బులు వసూలు
- ఓ బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టు చేసిన పోలీసులు
సులభంగా డబ్బు సంపాదించేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తారు. ఇతను మాత్రం ఆధునిక టెక్నాలజీతో ఈజీగా సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతూ అడ్డదారిలో ప్రయాణించి అడ్డంగా బుక్కయ్యాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు.
పోలీసుల కథనం మేరకు...విజయనగరానికి చెందిన వెన్నెల వెంకటేష్ విజయవాడలో చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతున్నాడు. ఇతను ఇన్ స్టాగ్రామ్ లో ఖాతాలున్న విద్యార్థులు, యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వాటిని టిండర్ యాప్ లో ఫోస్టు చేసేవాడు. ఫొటోల కింద ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలని ఫోన్ నంబరు ఇచ్చేవాడు.
సంప్రదించిన యువకులకు తన ఖాతాలో రూ.వంద, రూ.300, రూ.500 జమ చేయమని చెప్పేవాడు. అలా జమ చేసిన వారితో అమ్మాయిల పేరుతో తనే సరస సంభాషణలతో చాట్ చేసేవాడు. శృంగార దృశ్యాల ఫొటోలు, నీలి చిత్రాలు వాట్సాప్ లో పోస్టు చేసేవాడు. ఈ విధంగా రోజుకి రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వెంకటేష్ ఖాతాలో జమయ్యేవి.
ఈ డబ్బుతో హైదరాబాద్ వంటి చోట్లకు వారానికోసారి వెళ్లి పబ్ లలో విలాసాల్లో మునిగితేలేవాడు. వేలల్లో రమ్మీ ఆడేవాడు. కాగా, టిండర్ డేటింగ్ యాప్ లో తన ఫొటోలు ఉండడం గమనించిన బంజారాహిల్స్ కు చెందిన ఓ యువతి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు వారం రోజుల్లో నిందితుడిని గుర్తించి నిన్న అరెస్టు చేశారు.