గూగుల్ ఉద్యోగి భార్యకు కరోనా...వెతికి వెతికి మరీ పట్టుకున్న వైద్యులు!

  • హనీమూన్‌కు ఇటలీ వెళ్లి వచ్చిన నూతన దంపతులు 
  • బెంగళూరులో పనిచేస్తున్న భర్తకు వైరస్ సోకిందని నిన్న గుర్తింపు 
  • దీంతో అతని భార్య, కుటుంబ సభ్యులకు పరీక్షలు

భర్తకు కరోనా సోకిందన్న భయంతో భార్య పుట్టింటికి పారిపోయింది. అతని విషయం వెలుగు చూడడంతో అతని భార్యకూ సోకి ఉంటుందన్న అనుమానంతో వెతికి వెతికి మరీ పట్టుకుని ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించారు వైద్యులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ అంశానికి సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. బెంగళూరులోని గూగుల్ కేంద్రంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని నిన్న బయటపడిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అదే సమయంలో క్యాంపస్ లోని ఉద్యోగులందరినీ 'వర్క్ టు హోం'కు ఆదేశించారు.

ఇటీవలే ఈ ఉద్యోగి దంపతులు హనీమూన్ కోసం ఇటలీ వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చాక భర్తకు కరోనా సోకిందని తెలియగానే అతని భార్య ఆగ్రాలో ఉన్న పుట్టింటికి పారిపోయింది. ఈమె బెంగళూరు నుంచి విమానంలో ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి ఆగ్రాకు చేరుకుంది. గూగుల్ ఉద్యోగిపై దృష్టి పెట్టిన వైద్యాధికారులు వారు ఇటలీ వెళ్లి వచ్చిన విషయాన్ని గుర్తించారు.

దీంతో భర్తతోపాటు భార్యకు వైరస్ సోకే అవకాశం ఉందని బెంగళూరు వైద్యులు ఆగ్రా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని వైద్యుల బృందం టెకీ భార్య పుట్టింటికి వచ్చారు. వారు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించడంతో కలెక్టర్, పోలీసులు జోక్యం చేసుకోవడంతో టెకీ భార్య అంగీకరించింది.

ఆమెకు వైరస్ సోకిందని నిర్ధారణ కావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఆమెతోపాటు మొత్తం కుటుంబ సభ్యులు తొమ్మిది మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.



More Telugu News