మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సంచలన నిర్ణయం.. డైరెక్టర్స్ బోర్డుకు రాజీనామా

  • డైరెక్టర్ల బోర్డు, బెర్క్‌షైర్ హాత్‌వే బోర్డు నుంచి తప్పుకున్న బిల్
  • దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయాన్ని వెచ్చించేందుకే..
  • ఆయనతో కలిసి పనిచేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పిన సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించే ఉద్దేశంతో సంస్థ డైరెక్టర్ల బోర్డుతో పాటు బెర్క్‌షైర్ హాత్‌వే బోర్డు నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అభివృద్ధి, విద్య, పర్యావరణ మార్పులపై పోరు కోసం మరింత కృషి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బిల్‌గేట్స్ ఇకపై ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్లకు సాంకేతికపరమైన సహకారం అందించనున్నారు.

ఈ సందర్భంగా బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. బెర్క్‌షైర్ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని, దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించేందుకు ఇదే సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

బిల్‌గేట్స్ రాజీనామాపై సత్య నాదెళ్ల స్పందించారు.  కొన్నేళ్లపాటు బిల్‌గేట్స్‌తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన నాయకత్వం వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. బిల్‌గేట్స్‌తో కలిసి పనిచేసేందుకు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.


More Telugu News