రాజధాని రైతులను 10 రోజులు జైల్లో వేసి, మాచర్ల నిందితుడికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇస్తారా?: సీపీఐ రామకృష్ణ

  • టీడీపీ నేతలపై దాడికి పాల్పడిన తురకా కిశోర్ కు స్టేషన్ బెయిల్
  • ఆ నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారన్న రామకృష్ణ
  • ఇదేం న్యాయం అంటూ ఆగ్రహం
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలపై దాడి ఘటన నిందితుడు తురకా కిశోర్ కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై సీపీఐ అగ్రనేత రామకృష్ణ స్పందించారు. తురకా కిశోర్ తీవ్రస్థాయిలో విధ్వంసం సృష్టించడం మీడియాలో ప్రముఖంగా ప్రసారమైందని, ఆ తర్వాత ఎస్పీ, ఐజీ వెళ్లి 307 సెక్షన్ కింద హత్యాయత్నం నేరం మోపుతామని చెప్పారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే, హత్యాయత్నం నేరం మోపితే ఓ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

"వైసీపీ బెదిరింపు రాజకీయాలకు మాచర్ల సంఘటనే ఉదాహరణ. హత్యాయత్నం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ ఎవరివ్వాలి? న్యాయస్థానం ఇవ్వాలా? లేక పోలీసు స్టేషన్ లోనే ఇస్తారా? ఏ తప్పు చేయని రాజధాని రైతులను అన్యాయంగా 10 రోజులు జైల్లో ఉంచారు. కానీ రక్తపు గాయాలు అయ్యేలా తీవ్రదాడికి పాల్పడిన తురకా కిశోర్ అనే నిందితుడికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇదేం న్యాయం? దీనివల్ల ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయో ప్రభుత్వం ఆలోచించుకోవాలి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News