కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివి!

  • జమ్ము కశ్మీర్ లో అత్యవసర ఐసొలేషన్ వార్డుల నిర్మాణం
  • ఏప్రిల్ 15 వరకూ విదేశీ వీసాలు రద్దు
  • ఢిల్లీలో థియేటర్లు, స్కూళ్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేత
  • ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ లోనూ అదే విధానం
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74కు పెరగడంతో, ఈ ఉదయం అత్యవసరంగా సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైరస్ తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా, కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలపై ఆంక్షలు విధించింది. కరోనా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని, ఏప్రిల్ 15 వరకూ ఇచ్చిన వీసాలన్నింటినీ రద్దు చేయాలని ఆదేశించింది.

చలి తీవ్రత అధికంగా ఉండి, కరోనా త్వరగా విజృంభించే జమ్ము కశ్మీర్ లోని ఉధంపూర్ ప్రాంతంలో 100 పడకల సామర్థ్యం గల 4 ఐసోలేషన్ వార్డులను అత్యవసరంగా సిద్ధం చేసేందుకు నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలోని విద్యాసంస్థలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ స్వాగతించింది.

ఈ నెల 31 వరకూ మూసివేత నిర్ణయం అమలవుతుందని, ఆ తరువాత విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ లోనూ నెలాఖరు వరకూ స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని, కరోనా ప్రభావంపై చర్చించి, ఆయా రాష్ట్రాలు పాఠశాలలు, సభలు, సమావేశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది.


More Telugu News