సిద్ధిఖీకి వైద్యం చేసిన అందరిలోనూ కరోనా లక్షణాలు... 10 మంది ఐసోలేషన్ వార్డుకు!

  • ఇండియాలో తొలి కరోనా నిర్ధారిత మృతునిగా సిద్ధిఖీ
  • గుల్ బర్గాలో తొలుత వైద్య చికిత్స
  • మొత్తం 49 మందికి రక్త పరీక్షలు చేయిస్తున్న కర్ణాటక
ఇండియాలో తొలుత కరోనా అనుమానిత మరణంగా, ఆపై అధికారికంగా తొలి కరోనా మృతిగా నిర్ధారించబడిన మహ్మద్ హుసేన్ సిద్ధిఖీ (76)కి వైద్యం అందించిన 10 మంది డాక్టర్లు, నర్సుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించామని కర్ణాటక అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి గుల్ బర్గాకు వచ్చిన సిద్ధిఖీ, దగ్గు, జలుబుతో బాధపడుతూ, ఈ నెల 6న ఆసుపత్రిలో చేరారు. రక్త నమూనాల రిపోర్ట్ వచ్చేలోగా, 10న మరణించారు.

ఇక ఆయన దుబాయ్ నుంచి వచ్చిన తరువాత కలిసిన దాదాపు 50 మందిని గుర్తించి, వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి, పరీక్షలు నిర్వహిస్తున్నామని, రిపోర్టుల్లో కరోనా నెగటివ్ వస్తే, వెంటనే పంపిస్తామని, ఆపై వీరందరూ కనీసం 2 వారాల పాటు ఎవరినీ కలువకుండా ఉండాలని సూచించామని అధికారులు తెలిపారు.


More Telugu News