కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా పాజిటివ్!
- ఈ విషయం స్వయంగా ప్రకటించిన ప్రధాని
- ఆమెకు నిన్న జ్వరం రావడంతో వైద్య పరీక్షలు
- వైరస్ సోకిందని తేలడంతో ఐసోలేషన్ గదికి
ఇటీవలే బ్రిటన్ పర్యటనకు వెళ్లి వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రిగోయిర్ ట్రూడోకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాన మంత్రి ప్రకటించారు. 'నా భార్యకు స్వల్పంగా ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించాను. ఆమెకు కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ కావడంతో ఐసోలేషన్ గదికి వైద్యులు తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతోంది' అంటూ ట్రూడో తెలిపారు.
ప్రస్తుతం నేను వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యం ఇస్తున్నానని ప్రధాని తెలిపారు. 'ఫోన్ కాల్స్, సమావేశాలన్నీ ఆన్ లైన్లో జరుగుతున్నాయి. ఈరోజు ఒట్టావాలో జరగాల్సిన సమావేశాన్ని కూడా రద్దుచేసుకున్నాను. నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడుతాను' అని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. కెనడాలో కూడా కరోనా ప్రభావం ఎక్కువగానే వుంది. ఇప్పటి వరకు వందమంది బాధితులు తేలగా ఒకరు మృతి చెందారు కూడా.