కరోనా వైరస్ ను వూహాన్ కు తీసుకొచ్చింది అమెరికానే!: చైనా అధికారి సంచలన వ్యాఖ్యలు

  • వూహాన్ కు కరోనాను తీసుకొచ్చింది అమెరికా ఆర్మీనే
  • కరోనా వల్ల అమెరికాలో తొలి మరణం ఎప్పుడు జరిగింది?
  • దీనిపై అమెరికా వివరణ ఇవ్వాల్సిందే
చైనాలో కరోనా వైరస్ ప్రభావం కొంత మేర తగ్గినప్పటికీ... ప్రపంచ దేశాలపై ఆ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. దీని దెబ్బకు ఇటలీ, స్పెయిన్, ఇరాన్, దక్షిణకొరియా దేశాలు విలవిల్లాడుతున్నాయి. ఇండియాలో కూడా తొలి మరణం నమోదయింది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అమెరికాపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నిన్న రాత్రి ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.

వూహాన్ కు ఈ మహమ్మారిని తీసుకొచ్చింది అమెరికా ఆర్మీ అని లిజియాన్ ట్వీట్ చేశారు. దీనిపై అమెరికా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమెరికాలో కోవిడ్-19 వల్ల కొందరు మరణించారని పరీక్షల్లో తేలిందని చెప్పారు. కరోనా కారణంగా అమెరికాలో తొలి మరణం ఎప్పుడు సంభవించిందని ప్రశ్నించారు. ఆ దేశంలో ఎంత మందికి ఈ వైరస్ సోకిందని నిలదీశారు. పేషెంట్లు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల పేర్లు ఏమిటని ప్రశ్నించారు. లిజియాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది.

మరోవైపు, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కరోనా వైరస్ ను 'వూహాన్ వైరస్' అని ఇటీవల సంబోధించారు. దీంతో, చైనీయులు మండిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే లిజియాన్ ఈ మేరకు స్పందించి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.


More Telugu News