కేసీఆర్ నిర్ణయం మనందరికీ శిరోధార్యం: అభిమానులకు తెలిపిన పొంగులేటి
- రాజ్యసభ సీటు ఖాయమన్న ఊహాగానాలు
- సురేష్ రెడ్డిని ఎంపిక చేసిన అధిష్ఠానం
- దీనిపై స్పందించిన ఖమ్మం మాజీ ఎంపీ
రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కలేదన్న నిరాశ వద్దని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మనందరికీ శిరోధార్యమని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్న ఇద్దరు అభ్యర్థుల పేర్లను నిన్న అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు స్థానాల్లో ఒకదానిలో సీనియర్ నాయకుడు కేకేను కొనసాగిస్తూ మరోదానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేయనున్నారని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీనిపై తనకు అధిష్ఠానం నుంచి ఎటువంటి సమాచారం లేదని, అధినేత నిర్ణయం ఏదైనా శిరోధార్యమని ఆ సందర్భంలో పొంగులేటి ప్రకటించారు.
అయితే, చివరికి అభ్యర్థుల ఎంపికలో పొంగులేటికి షాక్ తగిలింది. కేకేతోపాటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి స్థానం కల్పించడంతో పొంగులేటి అభిమానులు సహజంగానే డీలాపడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేసీఆర్ నిర్ణయం శిరోధార్యమని ప్రకటించారు. 'పార్టీ నిర్ణయంపై అభిమానులు నిరాశ చెందవద్దు. త్వరలోనే మిమ్మల్నందరినీ కలుస్తాను' అంటూ పొంగులేటి కేడర్‌కు సూచించారు.