నెల్లూరు జిల్లా కరోనా బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉంది: ఆరోగ్య శాఖ కార్యదర్శి

  • నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్
  • రాష్ట్రంలో తొలి కేసు నమోదు
  • అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
  • బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ
రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవడం పట్ల ఏపీ సర్కారు అప్రమత్తమైంది. కరోనా నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి బులెటిన్ లో వెల్లడించారు.

ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. 14 రోజుల తర్వాత మళ్లీ శాంపిల్స్ పరీక్షించాక పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. కరోనా బాధితుడు కలిసిన ఐదుగురు వ్యక్తులను రెండు వారాల పాటు ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లుగా కలెక్టర్లను నియమించామని, పూర్తిస్థాయిలో మాస్కులు అందుబాటులో ఉంచామని వివరించారు. కరోనా అనుమానితుల వివరాలు తెలిపేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 0866-2410978 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుపవచ్చని జవహర్ రెడ్డి పేర్కొన్నారు.


More Telugu News