స్పెయిన్​ లో యువ మహిళా మంత్రికి కరోనా.. 2 వేలు దాటిన బాధితులు, 48 మంది మృతి

  • హై అలర్ట్ ప్రకటించిన స్పెయిన్ ప్రభుత్వం
  • మంత్రిని, ఆమె భర్తను క్వారంటైన్ చేసిన అధికారులు
  • మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు కరోనా టెస్టులు
  • దేశ రాజధాని మాడ్రిడ్ లో స్కూళ్లు, కాలేజీలు మూత
యూరప్ ఖండంలోని దేశాలపై పంజా విసురుతున్న కరోనా వైరస్ స్పెయిన్ లోనూ కలకలం రేపుతోంది. ఆ దేశ సంక్షేమ శాఖ మంత్రి ఇరేన్ మొంటెరోకు కరోనా పాజిటివ్ గా తేలినట్టు అధికారులు ప్రకటించారు. ఆమెను, ఆమె భర్త పాబ్లో ఇగ్లిసియాస్ ను క్వారంటైన్ చేసినట్టు తెలిపారు. ఇరేన్ భర్త ఇగ్లిసియాస్ స్పెయిన్ డిప్యూటీ ప్రధాన మంత్రి కూడా. ఆయనకు వైరస్ ఉన్నట్టు ఇంకా తేలలేదు. అయినా పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరినీ కూడా క్వారంటైన్ చేసినట్టు అధికారులు ప్రకటించారు.

అంతటా హై అలర్ట్

కరోనా వ్యాప్తితో స్పెయిన్ లో హై అలర్ట్ ప్రకటించారు. మంత్రికి కరోనా రావడంతో అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఏమేం చర్యలు చేపట్టాలో నిర్ణయించారు. తొలుత ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు వైరస్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. ప్రధాన మంత్రి, మంత్రులు అంతా ఎవరినైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మాట్లాడనున్నారు. మరోవైపు దేశ రాజధాని మాడ్రిడ్, మరికొన్ని ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలను కొద్దిరోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.

వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

స్పెయిన్ లో కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య ఇప్పటికే 2 వేలు దాటింది. అందులో చాలా వరకు గత నాలుగైదు రోజుల్లో నమోదైనవే. ఇక కరోనా మరణాల సంఖ్య 48కి పెరిగింది. ప్రధానంగా రాజధాని మాడ్రిడ్ లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.


More Telugu News