ప్రశంసలను ఎలా స్వీకరిస్తారన్న ప్రశ్నకు చిరంజీవి ఆసక్తికర సమాధానం

  • చిత్రం హిట్టయితే అది తానొక్కడి ఘనత కాదన్న చిరు
  • ఫ్లాప్ అయినా సమష్టిగా విఫలం అయ్యామని భావిస్తానని వెల్లడి
  • గర్వం తలకెక్కకుండా ఇంట్లో నేలపై పడుకుంటానని వివరణ
ఖైదీ నెంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి చిత్రంతో అలరించారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే పవర్ ఫుల్ మూవీ చేస్తున్నారు. కొరటాల గత చిత్రాల్లాగే ఇది కూడా సామాజిక ఇతివృత్తంతో కూడిన చిత్రం అని తెలుస్తోంది. ఇక అసలు విషయానికొస్తే.... చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

ఏదైనా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వెళ్లినప్పుడు అక్కడ అందరూ మిమ్మల్నే పొగుడుతుంటారు కదా, ఆ ప్రశంసలను ఎలా స్వీకరిస్తారు? అని ప్రశ్నించగా, ఎవరైనా తనను అభినందిస్తే అది తన గొప్పదనం కాదని, ఓ సినిమా విజయవంతం అయ్యేందుకు చిత్రబృందం యావత్తు ఎంతో శ్రమిస్తుందని తెలిపారు. విమర్శలు వస్తే ఆ చిత్రం విషయంలో సమష్టిగా విఫలం అయ్యామని భావిస్తానని వివరించారు. అంతేతప్ప తానొక్కడి వల్లే సినిమాలు విజయం  సాధించాయనో, ఫ్లాప్ అయ్యాయనో భావించనని, ఈ విషయంలో తాను నిజాయతీగా ఉంటానని స్పష్టం చేశారు. ఫంక్షన్లలో తనను ఎవరైనా ప్రశంసిస్తే వాటికే పొంగిపోనని, ఇంటికి వెళ్లగానే నేలపై పడుకుంటానని వెల్లడించారు. గర్వం తలకెక్కకుండా ఉండేందుకు అలా నేలపై పడుకుంటానని వివరించారు.


More Telugu News