కరోనా చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్.. ఇప్పటికే ఉన్న పాలసీలకూ వర్తింపు
బీమా కంపెనీలకు ఐఆర్ డీఏ ఆదేశాలు
కరోనా వైరస్ కేసులను తిరస్కరించొద్దు
పాలసీలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచన
కరోనా వైరస్ చికిత్సకు ఆరోగ్య బీమాను వర్తింపజేయాలని అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలను కేంద్ర బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్ డీఏ) ఆదేశించింది. వినియోగదారులకు ఎటువంటి ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉన్నా కూడా కరోనా వైరస్ సంబంధించిన చికిత్సను అందులో చేర్చాలని స్పష్టం చేసింది. కొత్త పాలసీలతో పాటు ఇప్పటికే ఉన్న పాలసీల్లో కూడా కరోనా చికిత్సను అందజేయాలని సూచించింది.
తక్షణమే అమల్లోకి తేవాలి
కరోనా వైరస్ కు సంబంధించిన చికిత్సను కూడా పాలసీల్లో చేర్చాలని ఆరోగ్య బీమా కంపెనీలకు ఈ నెల 4వ తేదీనే ఐఆర్ డీఏ సర్య్కులర్ జారీ చేసింది. తాజాగా పూర్తి స్థాయి మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వైరస్ సంబంధించి ఇప్పటికే ఉన్న పాలసీలకు కూడా వర్తింపజేయాలని, దీనిని తక్షణమే అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది.
కొత్త పాలసీలు రూపొందించండి
కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు వైద్య ఖర్చులను భరించాలని ఐఆర్ డీఏ బీమా కంపెనీలను ఆదేశించింది. అయితే పాలసీ వ్యయ పరిమితి, ఇతర అంశాల్లో పాలసీ నిబంధనల ప్రకారం వ్యవహరించవచ్చని సూచించింది. కరోనా వైరస్ బాధితులకు సంబంధించి బీమా క్లెయిమ్ లను తిరస్కరించే ముందు నిశితంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక కొత్తగా రూపొందించే పాలసీల్లో కరోనాను కూడా చేర్చాలని, ఆ వైద్యానికి అయ్యే ఖర్చును కూడా పొందు పర్చాలని ఆదేశించింది.