సొంత బాబాయినే వేసేశారు.. నన్ను వదులుతారని అనుకోవడం లేదు: బుద్ధా వెంకన్న

  • ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు వెంటే ఉంటా
  • నియంతపై పోరాటాన్ని కొనసాగిస్తా
  • ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధమే
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై నిన్న వైసీపీ వర్గీయులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇరువురు నేతలు గాయపడ్డారు. వీరితో పాటు వచ్చిన ఓ హైకోర్టు లాయర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ నేపథ్యంలో, సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా బుద్ధా వెంకన్న మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం సొంత బాబాయ్ నే వేసేశారని... వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ఒక సామాన్య బీసీ నాయకుడినైన తనను వదులుతారని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు.

ప్రాణం ఉన్నంత వరకు తమ అధినేత చంద్రబాబు వెంటే ఉంటానని వెంకన్న స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేర్పిన విలువలు, విధానాలకు కట్టుబడి ఉంటానని... నియంతపై పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఈ పోరాటంలో ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధమేనని అన్నారు.


More Telugu News