మీరు ఈపీఎఫ్ పింఛనుదారా... లైఫ్ సర్టిఫికెట్ విషయంలో ఈ మార్పు తెలుసుకోండి!
- ఏడాదిలో ఎప్పుడు ఇచ్చినా ఇకపై ఓకే
- ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఇవ్వాలని లేదు
- దీనివల్ల 64 లక్షల మందికి ప్రయోజనం
మీరు ఈపీఎఫ్ పింఛనుదారులా.... అయితే మీకో శుభవార్త. ఇకపై లైఫ్ సర్టిఫికెట్ ఏడాదిలో ఎప్పుడైనా ఇచ్చే అవకాశం కల్పిస్తూ సంస్థ నిబంధనల్లో మార్పు చేసింది. ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చేది. ఇందుకోసం ఓ గడువు విధించే వారు. ఆ గడువులోగా సర్టిఫికెట్ ఇవ్వాలి. లేదంటే పింఛన్ నిలిపివేసేవారు.
అయితే, ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా ఇచ్చే అవకాశాన్ని ఇప్పుడు కల్పించారు. 'ఈ నిబంధన మార్పువల్ల దేశవ్యాప్తంగా ఉన్న 64 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతారు' అని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది. 'ఉద్యోగులు ఆన్ లైన్లో సర్టిఫికెట్ పొందుపర్చవచ్చు. వారు ఏ తేదీన సర్టిఫికెట్ జత చేస్తారో అప్పటి నుంచి ఏడాది పాటు అది ఫోర్స్ లో ఉంటుంది. ఆ తేదీ ముగిసేలోగా కొత్త సర్టిఫికెట్ ఇచ్చేలా ఉద్యోగులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి' అని అధికారులు స్పష్టం చేశారు.