ఈసారి ట్రాన్సిట్ వారెంట్‌తో మెట్‌పల్లి వచ్చి.. లింగన్నను తీసుకెళ్లిన జమ్మూకశ్మీర్ పోలీసులు

  • సైన్యం రహస్యాలు చేరవేస్తున్న వ్యక్తికి నగదు బదిలీ
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న కుస్తాపూర్ వాసి
  • ట్రాన్సిట్ వారెంట్  లేకపోవడంతో గతంలో తిప్పి పంపిన కోర్టు
జమ్మూకశ్మీర్ పోలీసులు మరోమారు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వచ్చారు. సైన్యం రహస్యాలను చేరవేస్తున్న వ్యక్తికి నగదు బదిలీ చేసినట్టు జగిత్యాల జిల్లాలోని కుస్తాపూర్ వాసి సరికెల లింగన్న(35) ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆర్మీ క్యాంపులో కార్మికుడిగా పనిచేస్తున్న రాజేశ్ అనే యువకుడు అనిత అనే మహిళకు సైన్యానికి సంబంధించిన రహస్యాలను చేరవేస్తున్నట్టు గుర్తించిన అధికారులు జనవరిలో అతడిపై కేసు నమోదు చేశారు. రాజేశ్‌ను విచారించిన పోలీసులు వివిధ బ్యాంకుల నుంచి అతడి అకౌంట్‌కు డబ్బులు బదిలీ అయినట్టు గుర్తించారు. ఈ క్రమంలో కుస్తాపూర్‌కు చెందిన లింగన్న ఖాతా నుంచి గత నెల 13న రూ.5 వేలు, 20న రూ.40 వేలు జమ అయినట్టు నిర్ధారించారు.

దీంతో ఈ నెల 3న జగిత్యాల వచ్చిన జమ్మూకశ్మీర్ పోలీసులు లింగన్నను అదుపులోకి తీసుకుని మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే, ట్రాన్సిట్ వారెంట్ లేకపోవడంతో అతడిని తీసుకెళ్లేందుకు కోర్టు అంగీకరించలేదు. వెనక్కి వెళ్లిపోయిన పోలీసులు తాజాగా వారెంట్ కాపీతో మళ్లీ మెట్‌పల్లి వచ్చారు. నిన్న రాత్రి కోర్టులో హాజరు పరిచిన అనంతరం జమ్మూకశ్మీర్‌కు తరలించారు.


More Telugu News