రజనీకాంత్ ఇవాళ ఏం చెబుతారో... తమిళనాట సర్వత్ర ఆసక్తి!

  • నేడు కార్యదర్శులతో సమావేశం
  • ఆపై మీడియాతో మాట్లాడనున్న తలైవా
  • ఢిల్లీలో పార్టీ రిజిస్ట్రేషన్ పనులు మొదలు
  • రజనీ ప్రకటన కోసం ఇతర పార్టీల ఆసక్తి
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఇప్పుడు తమిళనాడులో ఎడతెగని చర్చ జరుగుతూ ఉంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీ చెప్పి, దాదాపు రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ హడావిడి తప్ప పెద్దగా వార్తలు లేవు. పార్టీ పేరును కూడా ఇప్పటివరకూ చెప్పలేదు. ఈలోగా రజనీ సహ నటుడు కమలహాసన్ పార్టీని పెట్టేశారు కూడా. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి, భారీగా కాకపోయినా, ఆశాజనకమైన ఓట్లను ఆయన పొందారు.

కానీ, ఇంతవరకూ రజనీకాంత్ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తూనే వచ్చారు. గతవారం రాష్ట్రవ్యాప్త రజనీ ప్రజా సంఘం జిల్లా కార్యదర్శులతో ఆయన సమావేశమైన తరువాత ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదైంది. ఈ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం అయ్యాయి. తాను మోసపోయానని, సమయం వచ్చినప్పుడు వివరాలు చెబుతానని రజనీ ఈ సమావేశంలో చెప్పారు. తాను ముఖ్యమంత్రిని కాలేనని, అలాంటి ఆశ తనకు లేదని రజనీకాంత్‌ నుంచి వచ్చిన వ్యాఖ్యలు విని ఫ్యాన్స్ ఓ రకంగా డీలా పడిపోయారు.

ఇదే సమయంలో మరో వారంలో తన మనసులోని మాటను చెబుతానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో నేడు మరోసారి కార్యదర్శులతో ప్రత్యేక భేటీని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. దాని అనంతరం మీడియా సమావేశం కూడా ఉండనుంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాదిలో జరుగనున్న నేపథ్యంలో రజనీ ఏం చెబుతారన్న విషయమై ఉత్కంఠ నెలకొని వుంది. తన రాజకీయ ప్రవేశంపై రజనీ ఈ సమావేశంలోనే స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలావుండగా, రజనీ తన పార్టీ పేరును ఇప్పటికే ఖరారు చేసుకున్నారని, దాని రిజిస్ట్రేషన్ పనులు హస్తినలో శరవేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది. నేడు రజనీ, తన కార్యదర్శుల సమావేశం అనంతరం చేసే ప్రకటనపై మిగతా రాజకీయ పార్టీల నాయకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇదే సమయంలో తాను ఎవరి చేతిలో ఎలా మోసపోయానన్న విషయాన్ని కూడా రజనీ వివరిస్తే, అది పతాక శీర్షికల్లోకి ఎక్కడం ఖాయం .


More Telugu News