కరోనా ఎఫెక్ట్​ నుంచి బయటపడేందుకు రూ.3 లక్షల కోట్లు.. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన బ్రిటన్​

  • వివరాలు వెల్లడించిన బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్
  • ఆర్థిక వ్యవస్థకు ఊపు ఇచ్చేందుకు వడ్డీ రేట్ల తగ్గింపు
  • త్వరలో అంతా సర్దుకుంటుందని భావిస్తున్నట్టు వెల్లడి
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకంగా రూ.3 లక్షల కోట్ల (3,900 కోట్ల డాలర్ల)తో ఉద్దీపన ప్యాకేజీని బ్రిటన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఊపు ఇచ్చేందుకు, ప్రజల వినియోగం, వ్యయాలను పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించింది. దీనికి సంబంధించి బ్రిటన్ ఆర్థిక మంత్రి, ఆ దేశ ప్రధాన బ్యాంకు ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ ప్రతినిధులు బుధవారం వేర్వేరుగా వివరాలను ప్రకటించారు.

ప్రభావం బాగానే ఉంది

ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రిటన్ పై కరోనా వైరస్ ప్రభావం గణనీయంగానే ఉందని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్ బుధవారం ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితి నెలకొందని.. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయని చెప్పారు. అయితే ఇదంతా తాత్కాలికమేనని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా 3,900 కోట్ల డాలర్లతో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని అమలు చేయనున్నట్టు ప్రకటించారు.

వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటించిన బ్యాంక్

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, దేశంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రకటించింది. ప్రస్తుతమున్న వడ్డీ రేట్లను పావు శాతం తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఇదొక మంచి పరిణామమని, ఈ ఒక్క చర్యతో దేశ ఆర్థిక వ్యవస్థ కనీసం ఒక శాతం మేర పుంజుకుంటుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ మార్క్ కెర్నీ తెలిపారు.


More Telugu News