మాచర్ల ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లి స్పందన

  • ఈ ఘటన జరిగిన తర్వాతే నాకు తెలిసింది
  • టీడీపీ నాయకుల కారు ఒకటి ఓ కుర్రాడికి తగిలింది
  • కారు ఆపకుండా వెళ్లిపోయారు.. టీడీపీ నాయకులు బెదిరించారు
మాచర్లలో టీడీపీ నాయకుల వాహనంపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై పిన్నెల్లి స్పందిస్తూ, ఈ ఘటన జరిగిన తర్వాతే తనకు తెలిసిందని, పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్నానని చెప్పారు. టీడీపీ నాయకులు ఉన్నపళంగా మాచర్లకు వస్తున్న విషయం తనకు తెలియదని, ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు.

టీడీపీ నాయకులు పది వాహనాల్లో  మాచర్ల వైపు స్పీడ్ గా వస్తున్న క్రమంలో అక్కడ నిలబడి ఉన్న ఓ కుర్రాడికి  కారు తగిలిందని, అయినా ఆపకుండా మాచర్ల టౌన్ లోకి వచ్చేశారని ఆరోపించారు. బాధితుడి తరఫు వాళ్లు  ఈ సమాచారాన్ని స్థానికంగా ఉన్న వారి బంధువులకు చెప్పడంతో వారు ప్రతిస్పందించారని చెప్పారు. అయితే, వాళ్లను టీడీపీ నాయకులు వారి స్టైల్ లో బెదిరించారని ఆరోపించారు. అంతేతప్ప, వారిపై కావాలని దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.

పది వాహనాల్లో టీడీపీ నాయకులు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? మాచర్లకు వాళ్లు వస్తున్నట్టు పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మాచర్లలో అలజడి సృష్టించి గొడవలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News