సమస్యలు పరిష్కరించమంటే చితకబాదుతారా?.. తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్​ ఫైర్​

  • అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు
  • వారిని అడ్డుకుని, లాఠీ చార్జి చేసిన పోలీసులు
  • ఈ తీరును నిరసిస్తూ బండి సంజయ్, డీకే అరుణ విమర్శలు
రాష్ట్రంలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేయడం దారుణమని బీజేపీ సీనియర్ లీడర్, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. బుధవారం విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడి కోసం ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని, లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. కొందరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్, బీజేపీ మరో సీనియర్ నేత డీకే అరుణ ప్రకటనలు విడుదల చేశారు.

వారు విద్రోహ శక్తులనుకున్నారా?: బండి సంజయ్

సమస్యలు తీర్చాలని కోరిన విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు చితకబాదడం సరికాదని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘‘ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే తప్పేంటి? వారిని విద్యార్థులనుకుంటున్నారా? విద్రోహ శక్తులనుకుంటున్నారా? ఉద్యమ కారులమని చెప్పుకొంటున్న ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు విద్యార్థి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతుందో పాలకులు త్వరలోనే చూస్తారు..” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలి: డీకే అరుణ

విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పా? అని డీకే అరుణ ప్రశ్నించారు. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు తీర్చే వరకు తాము కూడా పోరాటం చేస్తామని, విద్యార్థులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు.


More Telugu News