కారంపూడి నుంచే ఫాలో అయ్యారు... నామినేషన్ వేసేందుకు వెళుతున్నారని భావించాం: బుద్ధా వెంకన్న

  • మాచర్లలో తమపై జరిగిన దాడిని మీడియాకు వివరించిన బుద్ధా
  • తాము వెళ్లింది మూడు కార్లలోనే అని స్పష్టీకరణ
  • వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఆగ్రహం
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాచర్లలో తమపై జరిగిన భయానక దాడిని ఆయన వివరించారు. కారంపూడి నుంచే తమ వాహనాలను కొందరు ఫాలో అయ్యారని, అయితే వారిని నామినేషన్లు వేసేందుకు వెళుతున్నవారిగా భావించామని చెప్పారు. వారు తమపై దాడి చేసేందుకే ఫాలో అవుతున్నారని ఎలాంటి ఆలోచన రాలేదని స్పష్టం చేశారు.

"ఓ అంశంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి మేం పల్నాడు ఏరియాకు వెళ్లాల్సి వచ్చింది. మా వెంట పీఏలు, లాయర్లు కూడా ఉన్నారు. మూడు వాహనాల్లో మేం బయల్దేరాం. విజయవాడ నుంచి పది కార్లలో గూండాలతో వచ్చామని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మొన్న చంద్రబాబుపై, నిన్న లోకేశ్ పై, ఇవాళ మాపై దాడి చేశారు. చంద్రబాబునాయుడు కోసం పనిచేసే వ్యక్తుల్ని ఎవరినీ బతకనివ్వకూడదనే ఇలా దాడులు చేస్తున్నారు. జగన్ ఇవన్నీ ఓ పథకం ప్రకారం  చేయిస్తున్నారు.

నిజంగా చెబుతున్నా, ఇవాళ జరిగింది దాడి కాదు, పక్కా ప్లాన్ తో వచ్చారు. రాళ్లతో కొట్టడమో, అప్పటికప్పుడు ఘర్షణ పడడమో కాదు, పావుగంట సేపు సినిమాను తలపించేలా మా వెంట పడి రాడ్లు, కర్రలతో పొడుస్తూ  దాడి చేశారు. 17 కిలోమీటర్ల తర్వాత దాదాపు 200 మంది రోడ్డుపై మారణాయుధాలతో ఉన్నారు. అక్కడికి చేరుకోవడానికి సరిగ్గా రెండు నిమిషాల ముందు డీఎస్పీ వాళ్ల కారులో మమ్మల్ని ఎక్కించుకున్నారు. లేకపోతే ఏమై పోయేవాళ్లమో! ఇది ఏ దేవుడో మమ్మల్ని కాపాడేందుకు చేసిన మంచిపనిగా దీన్ని భావిస్తున్నాం" అంటూ ఘటన పూర్వాపరాలను వివరించారు.


More Telugu News